అర్ధశతాబ్దపు అఙానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా

అర్ధశతాబ్దపు అఙానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా !

కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా!

అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవుల్లో క్రూరమృగంలా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాలా
శతృవుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్త్యవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా అన్నల చేతిలొ చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురుమిన నెత్తుటి మందారం ఈ సంధ్యాసిందూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా గతి తోచని భారతమా!

తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుండట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా!

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు